ఏపీకి రూ.32 వేల కోట్ల హైస్పీడ్ కారిడార్
ఖరగ్‌పూర్–అమరావతి నాలుగు లైన్ల హైస్పీడ్ కారిడార్‌కు కీలక ముందడుగు... మొత్తం 1,107 కి.మీ.. ఆంధ్రప్రదేశ్‌లోనే 457 కి.మీ. మార్గం... ఏపీ అలైన్‌మెంట్‌కు కేంద్ర రవాణా శాఖ కమిటీ ఆమోదం.. ఏజెన్సీ ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం...

అమరావతి, ఆగస్టు 24: ఆంధ్రప్రదేశ్ రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో భారీ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరకు ప్రతిపాదించిన నాలుగు లైన్ల హైస్పీడ్ రోడ్ కారిడార్‌లో ఏపీ పరిధిలోని 457 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌కు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలిపింది. ఏపీ పరిధిలో ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.32 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.
ఖరగ్‌పూర్–అమరావతి హైస్పీడ్ కారిడార్ మొత్తం 1,107 కిలోమీటర్ల పొడవుతో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సాగనుంది. ఇందులో ఏపీలోనే 457 కిలోమీటర్ల మార్గం ఉండనుంది. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.75,629 కోట్లుగా పేర్కొంటుండగా, ఏపీ భాగానికి సుమారు రూ.32 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల మీదుగా..
ఏపీలో ఈ కారిడార్ కురుపాం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, అరకు, పాడేరు, చింతపల్లి, గోకవరం, కన్నాపురం, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, కామవరపుకోట, ద్వారకా తిరుమల, నూజివీడు ప్రాంతాల మీదుగా సాగి ఆగిరిపల్లి సమీపంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం కానుంది. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలకు మెరుగైన రహదారి అనుసంధానం కల్పించడంలో ఈ కారిడార్ కీలకంగా మారనుంది.
ఈ రహదారిని గంటకు సుమారు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా రూపొందించనున్నారు. 90 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేపట్టే ప్రతిపాదన ఉంది. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కోసం సంబంధిత జిల్లాల్లో అధికారుల నియామకానికి చర్యలు కొనసాగుతున్నాయి.
అమరావతికి కొత్త రహదారి అనుసంధానం
ఈ కారిడార్ పూర్తయితే ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ప్రాంతాల నుంచి అమరావతికి ప్రయాణ సమయం తగ్గడంతో పాటు సరకు రవాణా మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రధానంగా ఉపయోగిస్తున్న కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారి-16కు ప్రత్యామ్నాయ మార్గంగా కూడా ఈ హైస్పీడ్ కారిడార్ ఉపయోగపడనుంది.
ఏపీ అలైన్‌మెంట్‌కు ఆమోదం లభించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర రవాణా రంగ అభివృద్ధికి కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్, ఒడిశాలోనూ అలైన్మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సమగ్ర డీపీఆర్‌ను ఖరారు చేసి, ప్రాజెక్టుకు తదుపరి అనుమతుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నారు.

