పశ్చిమ వైసీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి: వెలంపల్లి ప్రజా హక్కుల పరిరక్షణకు పోరాడుతాం: దేవినేని


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
ఆగస్టు 15 — V10TV AP: బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ వైసీపీ కార్యాలయం వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన అనంతరం జెండాకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో అమరవీరుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛా భారతమన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం

నిరంతరం కృషి చేయడమే నిజమైన దేశభక్తి అని పేర్కొన్నారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం పార్టీ శ్రేణులు ప్రజల్లోనే ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కోసం తమ గళాన్ని బలంగా వినిపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ చైర్మన్లు బండి పుణ్యశీల, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, క్లస్టర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

