ఇంద్రకీలాద్రిపై ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
భక్తుల సంతృప్తిలో ప్రథమ స్థానం.. రికార్డు స్థాయిలో ఉత్సవాలు అభివృద్ధి పనులు, డిజిటల్ సేవలకు ప్రాధాన్యం.. ప్రగతి నివేదిక సమర్పించిన ఈవో వి.కె. శీనా నాయక్ విశేష ప్రతిభ కనబరిచిన 50 మంది సిబ్బందికి ప్రోత్సాహక ప్రశంసా పత్రాలు


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
ఆగస్టు 15, V10TV AP: ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ రాజగోపురం ప్రాంగణంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం దేవస్థానం గత ఏడాది కాలంలో సాధించిన ప్రగతిపై వార్షిక నివేదికను సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేల్లో భక్తుల సంతృప్తి స్థాయిలో దేవస్థానం ప్రథమ స్థానంలో నిలిచిందని ఈవో తెలిపారు. గత పదేళ్లుగా రథం సెంటర్లో ఆక్రమణలో ఉన్న దేవస్థానం భూమిని స్వాధీనం చేసుకుని భక్తుల సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. దసరా మహోత్సవాల్లో 18 లక్షల మందికి పైగా భక్తులకు విస్తృత వసతులు కల్పించామని, ఇటీవల ముగిసిన ఆషాఢ మాసంలో గత దశాబ్ద కాలంలోనే అత్యధికంగా ఆరు లక్షల మందికి పైగా భక్తులు సారె సమర్పించారని పేర్కొన్నారు. 250 మందికి పైగా చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. నూతన లడ్డూ పోటు, అన్నప్రసాద భవనాల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని ఈవో తెలిపారు. పవిత్ర కృష్ణానది హారతుల కోసం శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. ‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా ఆన్లైన్ సేవలు, కియోస్క్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు

వెల్లడించారు. ఈ సందర్భంగా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ సహకారంతో ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రతి సామాన్య భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. విధుల్లో విశేష ప్రతిభ, అంకితభావం కనబరిచిన వివిధ విభాగాలకు చెందిన 50 మంది సిబ్బందికి చైర్మన్, ఈవో ప్రోత్సాహక ప్రశంసా పత్రాలను అందజేశారు. అర్చకులు, కార్యాలయ సిబ్బంది, ఇంజనీరింగ్, భద్రత, పారిశుద్ధ్యం, కేశఖండన శాల, వేద పాఠశాల సిబ్బంది ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో ఉన్నారు. ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డులు అందుకోవడంతో సిబ్బందిలో హర్షం వ్యక్తమైంది. వాగ్దేవి కూచిపూడి నృత్యాలయ, విజయవాడ విద్యార్థులు నృత్యాచార్య సప్పశివకుమార్ ఆధ్వర్యంలో కళా ప్రదర్శన నిర్వహించారు. గాంధీనగర్ సంప్రదాయ పాఠశాల విద్యార్థులు జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, టి. హరికృష్ణ, టి. రమాదేవి, ఎస్. సరిత, వైదిక కమిటీ సభ్యులు, ఇంజనీరింగ్, పరిపాలనా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

