హరివిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు
పేద విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ... ఎయిడెడ్ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి... విద్యార్థులను ప్రోత్సహించడం తమ బాధ్యత: హరివిల్లు ఫౌండేషన్ అధ్యక్షులు ఎం. శశికాంత్...

ఆగస్టు 15 — V10TV AP.నగరంలో గత ఐదేళ్లుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హరివిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం చిట్టినగర్ కె.ఎల్.రావు నగర్లోని ఎస్.ఎస్.కె.జె.ఎమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులకు స్వీట్లు, బిస్కెట్లు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, పెన్సిల్ బాక్సులు తదితర స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు ఎం. శశికాంత్ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు చదువుకు ఉపయోగపడే పుస్తకాలు, స్టేషనరీ అందించడం తమ ఫౌండేషన్ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థులను చదువులో ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి చేపడితే వారు విద్యలో మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుందన్నారు.
కార్యక్రమానికి అతిథిగా హాజరైన దుద్దుకూరి శివరామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే అనేక ఎయిడెడ్ పాఠశాలల పరిస్థితి దుర్భరంగా ఉందని, కనీస సౌకర్యాలు కూడా లేని పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. అటువంటి పాఠశాలలను గుర్తించి విద్యార్థులకు సహాయం చేసేందుకు హరివిల్లు ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రధాన కార్యదర్శి డా. శరత్ కుమార్, పాఠశాల ఇన్చార్జ్ అధ్యాపకురాలు ఆశా కిరణ్, ఫౌండేషన్ సీనియర్ సభ్యులు ఎం. బాలసూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మొహమ్మద్ రఫీ, కార్యవర్గ సభ్యులు శ్రీదేవి, కిరణ్మయి, జి.ఎన్.బి. అప్పలరాజు, కోడిదాసు శ్రీనివాసరావు, పిల్లాడి త్రినాథ్, నజీర్ మొహమ్మద్, ఎం. రామకృష్ణ, యష్మిత, దుష్యంత్ తదితరులు పాల్గొన్నారు.

