మత్తు రహిత బెజవాడే లక్ష్యం.. సమాచారానికి నగదు బహుమతి
గంజాయి సేవించే వారి సమాచారం ఇస్తే రూ.1,500.. విక్రయదారుల జాడ చెబితే రూ.5 వేలు... సమాచార దాతల వివరాలు పూర్తిగా గోప్యం.. డ్రగ్స్ దందాపై కఠిన చర్యలు... ‘ఈగల్ ఛాలెంజ్’లో ప్రజలు, మీడియా, విద్యాసంస్థలు భాగస్వాములు కావాలని పోలీసుల పిలుపు...

విజయవాడ, ఆగస్టు 24: యువతను మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడటంతో పాటు విజయవాడ నగరాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీస్ శాఖ చేపట్టిన ‘ఈగల్ ఛాలెంజ్’ కార్యక్రమంపై కొత్తపేట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన సమావేశంలో ఈగల్ ఛాలెంజ్ లక్ష్యాలు, మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న చర్యలను వివరించారు.
ముఖ్యంగా యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా ముందస్తు అవగాహన కల్పించడమే ఈగల్ ఛాలెంజ్ ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్యపరంగానే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా ఎదురయ్యే తీవ్ర పరిణామాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. తల్లిదండ్రులు సైతం పిల్లల ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చే అనుమానాస్పద మార్పులను గమనించాలని, అవసరమైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.
డ్రగ్స్ విక్రయించడం, సరఫరా చేయడం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియా, ఇతర ఆన్‌లైన్ మార్గాల ద్వారా యువతను మాదకద్రవ్యాల వైపు ఆకర్షించే ప్రయత్నాల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలను నేరుగా భాగస్వాములను చేసేందుకు నగదు పారితోషికం అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలు సేవిస్తున్న వారి గురించి నిజమైన సమాచారం అందిస్తే రూ.1,500, మాదకద్రవ్యాల విక్రయం లేదా సరఫరాకు సంబంధించిన సమాచారం అందిస్తే రూ.5,000 పారితోషికంగా అందిస్తామని తెలిపారు. సమాచారం ఇచ్చే వ్యక్తుల పేర్లు, వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
డ్రగ్స్ నిర్మూలన కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, పోలీసులు–మీడియా–విద్యాసంస్థలు–తల్లిదండ్రులు–ప్రజలు సమన్వయంతో పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని కోరారు.
“డ్రగ్స్‌కు నో చెప్పండి – జీవితానికి అవును చెప్పండి” అనే సందేశాన్ని ప్రతి ఇంటికీ, ప్రతి యువకుడికీ చేరవేయాలని పిలుపునిచ్చారు. ఈగల్ ఛాలెంజ్‌కు మీడియా విస్తృత ప్రచారం కల్పించి మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కొత్తపేట పోలీసులు విజ్ఞప్తి చేశారు.

