అమరావతిలో క్వాంటం విప్లవం
క్వాంటం కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ... డిసెంబర్ చివరికల్లా భవనం సిద్ధం.. జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్ సేవలు... హైదరాబాద్‌కు ఐటీ హబ్ ఎలాగో.. అమరావతికి క్వాంటం హబ్ అలా: మంత్రి నారాయణ...

అమరావతి, ఆగస్టు 25: రాజధాని అమరావతిని భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానానికి కేంద్రంగా, నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న క్వాంటం కంప్యూటింగ్ భవన పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ చివరి నాటికి క్వాంటం కంప్యూటింగ్ భవనాన్ని సిద్ధం చేసి, జనవరి నుంచి సేవలను ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
అత్యాధునిక జర్మన్ టెక్నాలజీ ఆధారంగా క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థ రూపుదిద్దుకోనుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అమరావతి సాంకేతిక రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో పరిశోధన, ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అమరావతి ప్రధాన కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
“హైదరాబాద్‌కు ఐటీ హబ్ ఎలాంటి గుర్తింపు తీసుకొచ్చిందో, అమరావతికి క్వాంటం కంప్యూటింగ్ అలాంటి ప్రత్యేక గుర్తింపు తీసుకురాబోతోంది” అని నారాయణ పేర్కొన్నారు. అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా ప్రపంచస్థాయి నాలెడ్జ్, టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతిక రంగానికి ఎప్పటి నుంచో అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని నారాయణ చెప్పారు. ఆయన దూరదృష్టితోనే ఐటీ రంగంలో అవకాశాలు విస్తరించాయని, ప్రపంచవ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నారని పేర్కొన్నారు. అదే దూరదృష్టితో ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ వంటి భవిష్యత్ రంగాలను అమరావతికి తీసుకొస్తున్నామని తెలిపారు.
క్వాంటం కంప్యూటింగ్ సేవలు ప్రారంభమైతే అమరావతి సాంకేతిక రంగంలో సరికొత్త అధ్యాయానికి వేదిక అవుతుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

