82వ డివిజన్లో కూటమి ప్రచార జోరు
దాసరి ఉదయశ్రీ గెలుపే లక్ష్యంగా బొండా సిద్ధార్థ విస్తృత ప్రచారం… పైపుల రోడ్డు ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లతో మమేకం… సెంట్రల్లోని 29 డివిజన్లలోనూ కూటమి విజయమే లక్ష్యమని వెల్లడి…

విజయవాడ, అక్టోబర్ 21: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలోని 82వ డివిజన్లో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దాసరి ఉదయశ్రీ గెలుపే లక్ష్యంగా బుధవారం సాయంత్రం పైపుల రోడ్డు ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ యువనేత బొండా సిద్ధార్థ పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక ప్రజలను కలుసుకుని దాసరి ఉదయశ్రీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 29 డివిజన్లలోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపునకు కూటమి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థులను ఆదరించాలని కోరారు. ముఖ్యంగా 82వ డివిజన్ అభివృద్ధికి దాసరి ఉదయశ్రీ కృషి చేస్తారని తెలిపారు. ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లోనూ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహిస్తున్నామని బొండా సిద్ధార్థ వెల్లడించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ విజయవాడను మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.

