సెంట్రల్లో కూటమి క్లీన్‌స్వీప్ ఖాయం!
64వ డివిజన్లో లలిత ఏకగ్రీవంతో విజయానికి శ్రీకారం చుట్టామంటూ ధీమా… 61వ డివిజన్లో దామర్ల సరితకు మద్దతుగా విస్తృత ఎన్నికల ప్రచారం… ప్రజల ఆదరణతో వంద శాతం స్ట్రైక్‌రేట్ సాధిస్తామని వెల్లడి…

విజయవాడ, అక్టోబర్ 21: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 29 డివిజన్లలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం 61వ డివిజన్ గిరిపురం రెడ్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దామర్ల సరితకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. దామర్ల సరితను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్లో కూటమి అభ్యర్థి వీరమాచినేని లలిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇదే ఉత్సాహంతో మిగిలిన 28 డివిజన్లలోనూ విజయం సాధించి వంద శాతం స్ట్రైక్‌రేట్ నమోదు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో కూటమికి లభిస్తున్న ఆదరణ తమ విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు నగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి ప్రాంతంలో ప్రజలు హారతులతో స్వాగతం పలుకుతున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తామని చెప్పారు. 61వ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీ తదితర ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చామని, రానున్న రోజుల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత కార్పొరేటర్లు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, వారి కష్టసుఖాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజలకు సేవ చేసే నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని బొండా ఉమా పిలుపునిచ్చారు.

