పెళ్లి పేరుతో యువతికి రూ.15.77 లక్షల టోకరా!
షాదీ డాట్‌కామ్‌లో పరిచయంతో మోసానికి తెర… యూకే నుంచి బహుమతులంటూ కస్టమ్స్ ఛార్జీల వసూలు… మాచవరం పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతి…

విజయవాడ, అక్టోబర్ 30: పెళ్లి పేరుతో ఓ యువతిని నమ్మించి సైబర్ నేరగాళ్లు రూ.15.77 లక్షలు కాజేసిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది. ప్రముఖ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ షాదీ డాట్‌కామ్ ద్వారా యువతి వివరాలు సేకరించిన నిందితులు షమీర్, ఉమర్ అలీ ఆమెను మోసగించినట్లు ఫిర్యాదు అందింది. వివాహ సంబంధం పేరుతో యువతిని నమ్మించిన నిందితులు యూకే నుంచి విలువైన బహుమతులు పంపుతున్నట్లు చెప్పినట్టు సమాచారం. ఆ బహుమతులు భారత్‌కు చేరుకున్నాయని, వాటిని విడిపించేందుకు కస్టమ్స్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికారు. ఈ క్రమంలో విడతల వారీగా యువతి నుంచి రూ.15.77 లక్షలు వసూలు చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఎంతకీ బహుమతులు అందకపోవడంతో అనుమానం వచ్చిన యువతి తాను మోసపోయినట్లు గుర్తించింది. దీంతో మాచవరం పోలీసులను ఆశ్రయించగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

