అమెరికాలో సీనియర్ ఐపీఎస్ అధికారి కన్నుమూత!
చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన ఎన్. బాలసుబ్రహ్మణ్యం… ఏపీఎస్ఆర్టీసీ మాజీ ఎండీగా, రవాణా శాఖ కమిషనర్‌గా విశేష సేవలు… సీనియర్ అధికారి మృతితో పోలీసు, పరిపాలనా వర్గాల్లో విషాదం…

అమరావతి, అక్టోబర్ 30: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీఎస్ఆర్టీసీ మాజీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బాలసుబ్రహ్మణ్యం అమెరికాలో కన్నుమూసినట్లు సమాచారం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెరుగైన వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. 1994 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో పలు కీలక పదవులను నిర్వహించారు. రవాణా శాఖ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వ డిజిటల్ పరివర్తన కార్యక్రమమైన ఈ-ప్రగతి అథారిటీ సీఈఓగా కూడా సేవలందించారు. పరిపాలనతోపాటు సాంకేతిక పరిజ్ఞానంపై మంచి పట్టున్న అధికారిగా గుర్తింపు పొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయనను రవాణా శాఖ కమిషనర్‌గా, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆగస్టు వరకు ఆర్టీసీ ఎండీగా పనిచేసినట్లు సంస్థ అధికారిక వివరాలు వెల్లడిస్తున్నాయి. బాలసుబ్రహ్మణ్యం మరణవార్తతో పోలీసు, పరిపాలనా వర్గాల్లో విషాదం నెలకొన్నట్లు సమాచారం. ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ సహచరులు సంతాపం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

