భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ సారె
అన్నదాన విభాగం అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో సారె సమర్పణ.. మంగళవాయిద్యాల నడుమ చీర, గాజులు, పసుపు-కుంకుమలతో ప్రత్యేక పూజలు... కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్...

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఆలయ అన్నదాన విభాగం అధికారులు, సిబ్బంది కనకదుర్గమ్మకు సంప్రదాయబద్ధంగా ఆషాఢ సారె సమర్పించారు.
మంగళవాయిద్యాల నడుమ చీర, సారె, గాజులు, పసుపు-కుంకుమ తదితర మంగళ ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ రాధాకృష్ణ (గాంధీ), ఆలయ కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
అన్నదాన విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమలేశ్వర్ రావు, సూపరింటెండెంట్ హేమ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో అన్నదాన క్లర్కులు గంటా రమేష్, ప్రణీత్‌తో పాటు వంట మాస్టర్లు, కార్మికులు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తులకు నిత్యం అన్నప్రసాద సేవలు అందిస్తున్న అన్నదాన విభాగం సిబ్బంది సమిష్టిగా అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించడం అభినందనీయమని ఆలయ చైర్మన్, ఈవో పేర్కొన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు సిబ్బంది, వారి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సిబ్బందికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

