ఫారం-6 నింపినా చర్యలు ఉండవు!
ఓటర్లకు ఊరటనిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాలో పేర్లు లేనివారికి అవకాశం.. మరో నియోజకవర్గంలో ఓటు ఉండకూడదని స్పష్టీకరణ..

న్యూఢిల్లీ, నవంబర్ 16: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతైన వారికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టత ఇచ్చింది. ఓటర్ల జాబితాలో తిరిగి పేరు నమోదు చేసుకునేందుకు ఫారం-6 దాఖలు చేసినంత మాత్రాన సంబంధిత ఓటర్లపై చట్టపరమైన చర్యలు ఉండవని సుప్రీంకోర్టుకు వివరించింది. సాధారణంగా తొలిసారి ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఉద్దేశించిన ఫారం-6ను ఇప్పటికే ఓటరుగా ఉన్నప్పటికీ ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాలో పేరు కనిపించని వారు వినియోగించడంపై సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం, అలాంటి ఓటర్లు తిరిగి పేరు నమోదు కోసం ఫారం-6 సమర్పించినంత మాత్రాన చర్యలు తీసుకోబోమని స్పష్టం చేసింది. అయితే దరఖాస్తు చేసుకునే వ్యక్తికి మరో నియోజకవర్గంలో ఓటు నమోదు అయి ఉండకూడదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉండరాదనే నిబంధనను గుర్తుచేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో పేర్లు కనిపించని ఓటర్లకు ఎన్నికల సంఘం ఇచ్చిన ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఫారం-6 సమర్పించినంత మాత్రాన పేరు ఆటోమేటిక్‌గా నమోదవుతుందని భావించరాదని, సంబంధిత ఎన్నికల అధికారుల పరిశీలనకు లోబడి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

