ఏపీకి మరో రూ.29,500 కోట్ల పెట్టుబడులు!
విశాఖ సీఐఐ సదస్సులో రెన్యూ సంస్థతో రెండు భారీ ప్రాజెక్టులకు ఒప్పందం… పంప్డ్ స్టోరేజీకి రూ.12,500 కోట్లు.. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు రూ.17 వేల కోట్లు… మరో రూ.11 వేల కోట్ల ప్రాజెక్టుకు సూత్రప్రాయ అంగీకారం.. మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందాలు…

విశాఖపట్నం, నవంబర్ 12 : ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా మరో రెండు భారీ ప్రాజెక్టులకు మార్గం సుగమమైంది. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌తో రెన్యూ సంస్థ ఛైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో రూ.29,500 కోట్ల పెట్టుబడులతో రెండు భారీ ప్రాజెక్టులను చేపట్టేందుకు అంగీకారం కుదిరింది. మంత్రి లోకేష్ సమక్షంలో రెన్యూ సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాల్లో భాగంగా 2 గిగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.12,500 కోట్లు, గ్రీన్ అమ్మోనియా, ఈ-ఫ్యూయల్ ప్రాజెక్టుకు రూ.17 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు రెన్యూ సంస్థ వెల్లడించింది. వీటితోపాటు మరో రూ.11 వేల కోట్ల విలువైన పాలీ సిలికాన్, మెటలర్జికల్ గ్రేడ్ సిలికాన్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంస్థ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో రెన్యూ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టడం అభినందనీయమన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టులను వేగవంతంగా కార్యరూపంలోకి తీసుకురావాలని కోరారు. ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సహకారంతో తిరుపతి ఐఐటీలో ఏర్పాటు చేయనున్న సోలార్ సెల్ ప్రోటోటైపింగ్ కేంద్రంలో భాగస్వామ్యం వహించాలని రెన్యూ సంస్థను కోరారు. రెన్యూ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా మాట్లాడుతూ 2015 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థ వివిధ ప్రాజెక్టులను నిర్వహిస్తోందన్నారు. కళ్యాణదుర్గంలో 24 మెగావాట్ల విండ్ ప్రాజెక్టుతో కార్యకలాపాలు ప్రారంభించామని, ప్రస్తుతం రాష్ట్రంలోని పది ప్రాంతాల్లో 717 మెగావాట్ల పవన విద్యుత్, 60 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నామని తెలిపారు. గుంతకల్లులో రూ.22 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు వివరించారు. ఇందులో 1.8 గిగావాట్ల సౌర విద్యుత్, ఒక గిగావాట్ పవన విద్యుత్, 2 గిగావాట్ గంటల బ్యాటరీ నిల్వ సామర్థ్యం ఉంటుందని తెలిపారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో రూ.85,200 కోట్లతో వెయ్యి మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆగస్టులో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపిందన్నారు. రాంబిల్లిలో రూ.4,200 కోట్లతో 6.5 గిగావాట్ల ఇంగాట్-వేఫర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. కొత్త ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన రంగంలో మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఏర్పడనున్నాయి.

