హామీల అమలే లక్ష్యం.. అభివృద్ధే ధ్యేయం!
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది... సెంట్రల్లో రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం: ఎమ్మెల్యే బొండా ఉమ... 80వ డివిజన్లో బెవర సూర్యామణిని ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపు...

విజయవాడ, అక్టోబర్ 22: ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం 80వ డివిజన్ వాంబే కాలనీ బీ బ్లాక్‌లోని సన్యాసిరావు బట్టల దుకాణం వద్ద నుంచి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బెవర సూర్యామణితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని 29 డివిజన్లలో కూటమి అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు. వీరిలో 21 మంది టీడీపీ తరఫున సైకిల్ గుర్తుపై, ఆరుగురు జనసేన తరఫున గాజు గ్లాసు గుర్తుపై, ఇద్దరు బీజేపీ తరఫున కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారని వివరించారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రూ.3 వేలుగా ఉన్న సామాజిక పింఛన్లను రూ.4 వేలకు పెంచామని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 63 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని వివరించారు. సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సుమారు 25 వేల మందికి ఇళ్ల పట్టాలు అందజేశామని గుర్తుచేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా చేపట్టామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 27 నెలల కాలంలో దాదాపు రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రహదారులు, మౌలిక సదుపాయాలు, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వాంబే కాలనీలోని అన్ని బ్లాకుల ప్రజలు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తించి 80వ డివిజన్ టీడీపీ అభ్యర్థి బెవర సూర్యామణికి మద్దతు ఇవ్వాలని బొండా ఉమ విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీస్సులతో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

