సింగ్‌నగర్‌లో కూటమి ప్రచార జోరు!
79వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి ఎస్కే గౌసియాకు మద్దతుగా బొండా రవితేజ ప్రచారం... ప్రజా సమస్యల పరిష్కారం, డివిజన్ అభివృద్ధికే తొలి ప్రాధాన్యం... కూటమి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపు...

విజయవాడ, అక్టోబర్ 22: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 79వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్కే గౌసియా విజయాన్ని కాంక్షిస్తూ గురువారం సాయంత్రం సింగ్‌నగర్ మసీదు సెంటర్ నుంచి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో యువనాయకుడు బొండా రవితేజ పాల్గొన్నారు. స్థానిక ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొందడమే కాకుండా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి అవసరాలను తీర్చేలా పనిచేయాలని స్పష్టం చేశారు. డివిజన్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. సింగ్‌నగర్ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. 79వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి ఎస్కే గౌసియాకు ప్రజలు ఆశీస్సులు అందించాలని రవితేజ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రతి ఇంటికీ వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసాన్ని పొందడం ద్వారానే కూటమి అభ్యర్థుల విజయానికి బాటలు వేయగలమని పేర్కొన్నారు. ప్రజాసేవ, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని బొండా రవితేజ స్పష్టం చేశారు.

