మచిలీపట్నంలో కూటమి ప్రచార జోరు!
మేయర్ అభ్యర్థి అబ్దుల్ అబీదా ఆధ్వర్యంలో భారీ రోడ్‌షో... ప్రచారంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి సందడి... కూటమి విజయంతోనే మచిలీపట్నం సమగ్రాభివృద్ధి సాధ్యమని నేతల ధీమా...

మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో కూటమి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థి అబ్దుల్ అబీదా గురువారం నగరంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఒకటో డివిజన్ హౌసింగ్ బోర్డు ప్రాంతం నుంచి ప్రారంభమైన ఈ రోడ్‌షోలో కూటమి కార్పొరేటర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీధివీధినా ప్రచారం నిర్వహిస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ రోడ్‌షోలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రోడ్‌షో సందర్భంగా పలుచోట్ల ప్రజలు మేయర్ అభ్యర్థి అబ్దుల్ అబీదాతో పాటు కార్పొరేటర్ అభ్యర్థులకు స్వాగతం పలికారు. నగరంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మచిలీపట్నాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థితో పాటు కార్పొరేటర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి శ్రేణుల భారీ సమీకరణతో రోడ్‌షో ఉత్సాహంగా సాగింది. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా నగరంలోని అన్ని డివిజన్లలో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నట్లు కూటమి నాయకులు తెలిపారు.

