ప్రజాసేవే లక్ష్యం.. అభివృద్ధే ధ్యేయం!
76వ డివిజన్లో కూటమి అభ్యర్థి గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా ప్రచారం... ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకే కూటమి ప్రాధాన్యం: బొండా సిద్ధార్థ... ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన కర్తవ్యమని వెల్లడి...

విజయవాడ, అక్టోబర్ 22: ప్రజలకు సేవ చేయడమే రాజకీయ నాయకుల ప్రధాన బాధ్యతని, అధికారమంటే హోదా కాదని, ప్రజల సమస్యలను పరిష్కరించే అవకాశమని తెలుగుదేశం పార్టీ యువనాయకుడు బొండా సిద్ధార్థ పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో గురువారం సాయంత్రం 76వ డివిజన్ దేవీనగర్‌లోని టీడీపీ కార్యాలయం నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థి గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పలు పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. గతంలో రూ.3 వేలుగా ఉన్న వృద్ధాప్య పింఛన్‌ను రూ.4 వేలకు పెంచడం ఇందుకు నిదర్శనమన్నారు. 76వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న గాదిరాజు శ్రీనివాసరాజు ప్రజల సమస్యలపై నిరంతరం స్పందించే నాయకుడని సిద్ధార్థ కొనియాడారు. రామకృష్ణాపురం, దేవీనగర్ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు, పింఛన్లు, ఇళ్ల పట్టాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన నాయకుడిగా ఆయనను ఎన్నికల బరిలో నిలిపినట్లు వివరించారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. డివిజన్లో రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను గుర్తించి అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజా జీవితంలో పదవులు అలంకారం కోసం కాదని, ప్రజలకు సేవ చేసేందుకేనని పేర్కొన్నారు. విజయవాడ నగర సమగ్రాభివృద్ధితో పాటు ప్రతి డివిజన్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడమే తమ లక్ష్యమన్నారు. 76వ డివిజన్ ప్రజలు కూటమి అభ్యర్థి గాదిరాజు శ్రీనివాసరాజును ఆశీర్వదించాలని బొండా సిద్ధార్థ విజ్ఞప్తి చేశారు.

