అన్నప్రసాద వితరణలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి!
కార్తీక మాసం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లపై ఈఓ దృష్టి... క్యూలైన్లు, భోజన వితరణ ప్రదేశాలను పరిశీలించిన శీనా నాయక్... భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచన...

విజయవాడ, నవంబర్ 14 : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారి అన్నప్రసాదం స్వీకరించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ అధికారులకు సూచించారు. శనివారం ఉదయం ఆలయంలో అన్నప్రసాద వితరణకు సంబంధించిన ఏర్పాట్లను ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అన్నప్రసాదం కోసం భక్తులు వేచి ఉండే క్యూలైన్లు, భోజన వితరణ ప్రదేశం, నిరీక్షణ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. కార్తీక మాసంలో అన్నప్రసాదం స్వీకరించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తూ అన్నప్రసాద వితరణ సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు రాఘవ రాజు, శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమ తదితరులు పాల్గొన్నారు.

