అనుమానం పెనుభూతమై.. భార్యను బలిగొన్న భర్త!
మచిలీపట్నంలో దారుణం.. గొంతు నులిమి భార్య హత్య… వేరే వ్యక్తితో మాట్లాడుతోందనే అనుమానంతో ఘాతుకం… హత్య అనంతరం పోలీసులకు స్వయంగా లొంగిపోయిన భర్త…

మచిలీపట్నం, అక్టోబర్ 20: అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను గొంతు నులిమి హత్య చేసిన దారుణ ఘటన మచిలీపట్నంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. పులిగడ్డకు చెందిన మండలి శ్రీరామ్‌కు బందరు మండలం జొన్నలవారి మోడీ గ్రామానికి చెందిన అడ్డాల విజయ రామ దుర్గాదేవితో 2024లో వివాహమైంది. శ్రీరామ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా, విజయ ఓ ప్రైవేటు దుకాణంలో టైపిస్టుగా పనిచేస్తోంది. కొంతకాలంగా భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతోందనే అనుమానంతో శ్రీరామ్ ఆమెతో గొడవపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున దంపతుల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన శ్రీరామ్ భార్య గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య అనంతరం శ్రీరామ్ స్వయంగా ఆర్‌పేట పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఘటన విషయం తెలుసుకున్న సీఐ ఏసుబాబు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టకు తరలించారు.

