జోగి రమేష్‌పై కోడలు మేఘన సంచలన ఆరోపణలు
‘అదనపు కట్నం తెస్తేనే హ్యాపీగా ఉంటావని అత్త అన్నారు’ అంటూ మేఘన ఆరోపణ... తన వద్ద ఉన్న ఆధారాలన్నీ పోలీసులకు అందజేశానని వెల్లడి... భార్యాభర్తల సమస్యను పరిష్కరించకుండా జోగి రమేష్ దంపతులే వివాదం సృష్టించారని వ్యాఖ్య...

విజయవాడ, ఆగస్టు 25: మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబంపై ఆయన కోడలు మేఘన మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తనపై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర బాధ కలిగించాయని పేర్కొన్నారు.
తన వైవాహిక జీవితానికి సంబంధించిన వివాదంపై తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ ఇప్పటికే పోలీసులకు అందజేశానని మేఘన తెలిపారు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన సమస్యను పెద్దలుగా పరిష్కరించాల్సిన జోగి రమేష్ దంపతులు అలా చేయకుండా వివాదాన్ని మరింత పెంచారని ఆమె ఆరోపించారు.
“అదనపు కట్నం తెస్తేనే నువ్వు హ్యాపీగా ఉంటావని మా అత్త నాతో అన్నారు” అని మేఘన ఆరోపించారు. తనకు ఎదురైన పరిణామాలకు సంబంధించిన ఆధారాలను పోలీసుల ముందు ఉంచానని, విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.
వివాహానికి ముందు జోగి రమేష్ కుటుంబం హిందూ మతాన్ని అనుసరిస్తున్నట్లు తనకు చెప్పారని, అయితే పెళ్లి అనంతరం వారు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న విషయం తనకు తెలిసిందని మేఘన పేర్కొన్నారు. జోగి రమేష్ ఇంట్లో పూజ గది కూడా లేదని ఆమె వ్యాఖ్యానించారు.
తనపై చేసిన వ్యాఖ్యలకు స్పందించేందుకే మీడియా ముందుకు వచ్చినట్లు మేఘన తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై చట్టపరంగా పోరాటం కొనసాగిస్తాననే సంకేతాలిచ్చారు.

