కళాకారుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా?
సాహిత్య, కళా రంగాలను విస్మరించడం దారుణం: ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్... వృద్ధ కళాకారులకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్... కళారంగానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి.. విజయవాడలో కళాకారుల నిరసన...

విజయవాడ, ఆగస్టు 25: సమాజ పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడే సాహిత్య, కళా రంగాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్ విమర్శించారు. మంగళవారం విజయవాడ లెనిన్ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి, అభ్యుదయ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కళాకారుల సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రనాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళారంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. వివిధ కళారంగాల్లో నైపుణ్యం ఉన్నప్పటికీ ఆదరణ, ఉపాధి అవకాశాలు లేక అనేక మంది కళాకారులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సాహిత్యం, కళలు సమాజానికి వినోదంతో పాటు విజ్ఞానం, ఉత్తేజం, చైతన్యం అందించే శక్తివంతమైన సాధనాలని పేర్కొన్నారు. అలాంటి రంగాలను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ విధానాలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కళాకారులకు ప్రత్యేక పెన్షన్ విధానం ఉండేదని, దాన్ని రద్దు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
కళాకారుల అవసరాలను ప్రభుత్వం గుర్తించి వృద్ధ కళాకారులకు నెలకు రూ.10 వేల పెన్షన్ అందించాలని చంద్రనాయక్ డిమాండ్ చేశారు. కళలు, సాంస్కృతిక రంగాల పరిరక్షణ, అభివృద్ధి కోసం రూ.500 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించడంతో పాటు కళాకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
అభ్యుదయ రచయితల సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పరచూరి అజయ్ మాట్లాడుతూ సాహిత్య, కళా రంగాలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా కళారంగం నుంచి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ కళాకారుల సమస్యలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని విమర్శించారు. సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు ప్రాచీన జానపద కళారూపాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరారు.
ప్రజానాట్యమండలి నాయకుడు పిచ్చయ్య లంక దుర్గారావు మాట్లాడుతూ మానవ సమాజ పురోభివృద్ధిలో కళాకారుల పాత్రను విస్మరించలేమన్నారు. నిరసనలో భాగంగా కె.వి. భాస్కరరావు నాయకత్వంలో కళాకారులు స్కిట్‌ను ప్రదర్శించారు.
కార్యక్రమంలో ప్రముఖ కళాకారుడు బొబ్బెళ్లపాటి సాయి, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు పిచ్చయ్య లంక దుర్గారావు, నజీర్, దోనెపూడి సూరిబాబు, కె.వి. భాస్కరరావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్, భాషా రంగారావు, లంక గోవిందరాజులు, వనిత, అరుణోదయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియాను కలిసి వినతిపత్రం సమర్పించి కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

