ఎంపీపీ, జడ్పీ పీఠాల ఎన్నికకు రంగం సిద్ధం!
పరోక్ష ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు… చేతులెత్తే పద్ధతిలో అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక… పార్టీ విప్ ధిక్కరిస్తే సభ్యత్వం రద్దుకు అవకాశం…

అమరావతి, నవంబర్ 10 : రాష్ట్రంలో మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ల పరోక్ష ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల ప్రత్యేక సమావేశాలకు సంబంధించి నవంబర్ 14వ తేదీలోగా సభ్యులకు నోటీసులు అందజేయాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించింది. మధ్యాహ్నం ఒంటి గంటకు కో-ఆప్షన్ ఎన్నిక ఎన్నికల రోజున ఉదయం 10 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ చేపడతారు. అధ్యక్ష లేదా ఛైర్‌పర్సన్ ఎన్నిక పూర్తయిన తర్వాతే ఉపాధ్యక్ష లేదా వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించనున్నారు. విప్ ధిక్కరిస్తే సభ్యత్వంపై వేటు ఎంపీపీ, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ల ఎన్నికలను చేతులెత్తే పద్ధతిలో నిర్వహించనున్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు జారీచేసే విప్‌కు అనుగుణంగా సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది. విప్‌ను ధిక్కరించిన సభ్యులపై అనర్హత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు పార్టీ విప్ నిబంధన వర్తించదు. పార్టీ విప్‌గా వ్యవహరించే వ్యక్తుల వివరాలను ఎన్నికకు ముందు రోజు ఉదయం 11 గంటలలోగా ప్రిసైడింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. కోరం లేకపోతే మరుసటి రోజే ఎన్నిక ఎన్నికల సమావేశానికి అవసరమైన కోరం లేకపోయినా, ఇతర అనివార్య కారణాలతో ఎన్నిక వాయిదా పడినా మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి నిర్వహించనున్నారు. ఆ రోజు సెలవు దినమైనప్పటికీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక అనివార్య కారణాలతో జరగకపోతే ఆ తర్వాత నిర్వహించాల్సిన అధ్యక్ష, ఛైర్‌పర్సన్ ఎన్నికల సమావేశం కూడా రద్దవుతుంది. ఎన్నికల కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఎన్నికల సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించనున్నారు. అయితే వారికి ఓటు హక్కు ఉండదు. ఎన్నికల కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ఎన్నికల ప్రక్రియను వీడియో చిత్రీకరించడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యక్ష ప్రసారానికి కూడా అనుమతి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

