డాక్టర్ గరికపాటి రాజారావుకు ఘన నివాళులు
63వ వర్ధంతి సందర్భంగా పోరంకిలో విగ్రహానికి పూలమాలలు... ప్రజా చైతన్యానికి కళే ఆయుధమని ప్రజానాట్యమండలి నేతల పిలుపు... కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి...

పోరంకి, సెప్టెంబరు 8: ప్రజా కళాకారుడు, ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు డాక్టర్ గరికపాటి రాజారావు 63వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి, ఆంధ్ర ప్రజానాట్యమండలి సంయుక్త ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. పోరంకి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర కోశాధికారి ఆర్. పిచ్చయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ మార్పు కోసం కళను ఆయుధంగా మలిచిన మహనీయుడు గరికపాటి రాజారావు అని కొనియాడారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా కళాకారులు చైతన్యాన్ని విస్తరించాల్సిన బాధ్యత ఉందన్నారు. నాటికలు, నాటకాలు, జానపద కళారూపాలు, నూతన సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా సామాజిక అసమానతలు, మూఢనమ్మకాలు, దోపిడీ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.
గ్రామీణ, జానపద, పౌరాణిక నాటక రంగ కళాకారులు ఆర్థిక ఇబ్బందులతో దుర్భర జీవితం గడుపుతున్నారని, ఎన్నికల సమయంలో మాత్రమే వారిని ఉపయోగించుకుని తరువాత విస్మరించడం తగదని పేర్కొన్నారు. కళాకారుల జీవన భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో అనుమొల ప్రభాకర్, నార్ల వెంకటేశ్వరరావు, వెలగపూడి ఆజాద్, ప్రేమ్ కుమార్, పోతురాజు నాగేశ్వరరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

