పట్టాలెక్కనున్న దేశ తొలి బుల్లెట్ ట్రైన్
ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పనుల్లో వేగం... తొలి టెస్ట్ కోచ్ సిద్ధం.. డిసెంబరు నాటికి వాపి–సూరత్ సివిల్ పనులు పూర్తి... 2027లో సూరత్–బిలిమోరా సెక్షన్లో తొలి సర్వీసులకు సన్నాహాలు: అశ్వినీ వైష్ణవ్...

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: దేశ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ పనులు వేగంగా సాగుతున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. బుల్లెట్ ట్రైన్ కోసం తొలి పరీక్ష కోచ్ ఇప్పటికే తయారైనట్లు తెలిపారు.
508 కిలోమీటర్ల ముంబై–అహ్మదాబాద్ కారిడార్‌లో తొలి దశగా గుజరాత్‌లోని సూరత్–బిలిమోరా సెక్షన్‌ను 2027లో ప్రారంభించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం వాపి–సూరత్ తదితర సెక్షన్లను దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
వాపి–సూరత్ సెక్షన్‌కు సంబంధించిన సివిల్ నిర్మాణ పనులను 2026 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వైష్ణవ్ తెలిపారు. రైళ్ల తయారీ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి ప్రాంతాలను ఈ హైస్పీడ్ కారిడార్ అనుసంధానించనుంది. గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల ఆపరేటింగ్ వేగానికి ఈ కారిడార్‌ను రూపొందించారు.

