వర్షపు నీటికి యంత్రాంగం అడ్డుకట్ట
జిల్లా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ నగర రహదారులపై నిలిచిన నీటి తొలగింపు లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

విజయవాడ, సెప్టెంబర్ 24: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయక చర్యలపై అధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో విజయవాడ నగర పరిధిలోని రహదారులపై నిలిచిన వర్షపు నీటిని ప్రత్యేక వాహనాలు, ఇంజిన్లతో ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. వర్షాకాల స్పందన బృందాలు క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్నాయి. లోతట్టు, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాలువల్లో నీరు సాఫీగా ప్రవహించేలా గుర్రపుడెక్క, చెత్తాచెదారం తదితర అడ్డంకులను తొలగిస్తున్నారు. వర్షాలు తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

