కార్తీక పూజలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు!
సహస్ర లింగార్చన ఏర్పాట్లపై ఈవో ప్రత్యేక దృష్టి… మల్లేశ్వరస్వామి ఆలయంలో పూజా ఏర్పాట్ల పరిశీలన… ఇంజినీరింగ్ అధికారులకు ఈవో శీనా నాయక్ ఆదేశాలు…

విజయవాడ, నవంబర్ 8 : పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి క్షేత్రంలోని శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఆదివారం ఉదయం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఆలయ పరిసరాలను పరిశీలించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర కార్తీక మాసం సందర్భంగా నిర్వహించనున్న సహస్ర లింగార్చనకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించి ఏర్పాట్లపై ఇంజినీరింగ్ సిబ్బందితో చర్చించారు. పూజా కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అలాగే శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజా క్రతువులు, వైదిక కార్యక్రమాల గురించి వైదిక కమిటీ సభ్యుడు బి. శంకర శాండిల్యతో ఈవో శీనా నాయక్ చర్చించారు. కార్తీక మాస పూజల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.

