ఆహార కల్తీపై ఉక్కుపాదం.. 3,270 టన్నుల నాసిరకం సరుకులు సీజ్!
రెండు నెలల్లో రూ.81.80 కోట్ల విలువైన ఆహార పదార్థాల స్వాధీనం… దేశవ్యాప్తంగా 56,431 దుకాణాలు, హోటళ్లలో తనిఖీలు… 1,133 లైసెన్సుల సస్పెన్షన్.. 10,047 సంస్థలకు నోటీసులు…

న్యూఢిల్లీ, నవంబర్ 8 : ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆహార వ్యాపార సంస్థలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కొరడా ఝళిపించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన విస్తృత తనిఖీల్లో భారీ మొత్తంలో కల్తీ, నాణ్యతలేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. రెండు నెలల వ్యవధిలో రూ.81.80 కోట్ల విలువైన 3,270 మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలను సీజ్ చేసినట్లు వెల్లడించింది. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వ్యాపార సంస్థలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా 56,431 దుకాణాలు, హోటళ్లు, ఆహార తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో 1,133 సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేయగా, మరో 10,047 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా వంటనూనెలు, పాలు, పనీర్, స్వీట్లు, నెయ్యి, చాక్లెట్లు, ఐస్క్రీమ్ వంటి ఆహార పదార్థాలకు సంబంధించిన 2,273 నమూనాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తించినట్లు సమాచారం. ఈ భారీ తనిఖీలు ఆహార భద్రతపై మరోసారి చర్చకు దారితీశాయి. ప్రజలు కొనుగోలు చేసే ఆహార పదార్థాల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

