వైసీపీ స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో గరికపాటి శ్రీదేవి
మైలవరం నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు.. ఇబ్రహీంపట్నం నుంచి శ్రీదేవికి కీలక బాధ్యత.. నియామకంపై పార్టీ శ్రేణుల హర్షం..

ఇబ్రహీంపట్నం:
మైలవరం నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ కోసం వైసీపీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ జోగి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఇబ్రహీంపట్నానికి చెందిన ఉమ్మడి జిల్లా జడ్పీ వైస్ చైర్‌పర్సన్ గరికపాటి శ్రీదేవి రాంబాబుకు స్థానం కల్పించారు.
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మహిళా విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవికి స్థానిక ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గత కొంతకాలంగా నియోజకవర్గ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న ఆమె, పార్టీ కార్యక్రమాల్లో ముందుండి పాల్గొంటూ క్యాడర్‌తో సమన్వయం కొనసాగిస్తున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆమెకు బాధ్యతలు అప్పగించడంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి క్షేత్రస్థాయిలో సమన్వయం, పార్టీ శ్రేణుల ఏకీకరణ, ఎన్నికల వ్యూహాల అమలులో ఈ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ క్యాడర్‌లో ఉత్సాహం కనిపిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

