అమరావతి రైల్వే లైన్‌కు కీలక అడుగు
వీరులపాడు మండలంలో కీలక ముందడుగు.. 15, 16 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయంలో భూసేకరణ సభ.. రైతులు, భూ యజమానుల అభిప్రాయాల సేకరణకు అధికారుల ఏర్పాట్లు..

వీరులపాడు: అమరావతి రాజధానికి రైల్వే అనుసంధానం కల్పించే ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు నూతన బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ ప్రాజెక్టును ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా ప్రకటించగా, ఎన్టీఆర్ జిల్లాలో అవసరమైన భూముల సేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం 57 కిలోమీటర్ల ఈ రైల్వే ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,047 కోట్లు.
ఈ నేపథ్యంలో అల్లూరు, చెన్నారావుపాలెం, జుజ్జూరు, గూడెం మాధవరం తదితర గ్రామాల్లో భూసేకరణకు సంబంధించి ఈ నెల 15, 16 తేదీల్లో వీరులపాడు తహసీల్దార్ కార్యాలయంలో సభ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. భూములు కోల్పోయే రైతులు, భూ యజమానులు ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు అధికారుల దృష్టికి తీసుకురావడానికి అవకాశం కల్పించనున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో కంచికచర్ల, వీరులపాడు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ఈ రైల్వే లైన్ కోసం దాదాపు 300 ఎకరాల భూమి అవసరమవుతున్నట్లు భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన వివరాలు సూచిస్తున్నాయి.
ఈ రైల్వే లైన్ పూర్తయితే అమరావతికి జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో నేరుగా అనుసంధానం ఏర్పడటంతో పాటు విజయవాడ జంక్షన్‌పై రైళ్ల రద్దీని కొంత మేర తగ్గించే అవకాశం ఉందని అంచనా.

