ఓటర్ల హక్కులను కాపాడాలి
ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని కాంగ్రెస్ డిమాండ్... ఓటర్ల జాబితా అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి... ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 28: ఓటర్ల జాబితాల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, అర్హుల పేర్ల తొలగింపు, ఓటర్ల నమోదు ప్రక్రియలో మార్పులపై ఎన్నికల సంఘం పత్రాధారాలతో సమాధానం చెప్పాలని కోరుతూ విజయవాడలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాలు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పిలుపు మేరకు ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జేడీ శీలం, షేక్ మస్తాన్‌వలీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ల స్థాయిలో నమోదైనట్లు చెబుతున్న 14 అభ్యంతరాలకు సంబంధించిన దస్త్ర వ్యాఖ్యలు, సమావేశ వివరాలు, తీసుకున్న చర్యల నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల నమోదు దరఖాస్తులో చేసిన మార్పులకు చట్టపరమైన ఆధారంతోపాటు సంబంధిత అధికారిక ప్రకటనను విడుదల చేయాలని కోరారు. ఎన్నికల సంఘం సమాచార వ్యవస్థలోని ఓటర్ల వివరాల భద్రతపై స్వతంత్ర తనిఖీ నిర్వహించాలన్నారు. గోవాలో ఓటర్ల పేర్ల తొలగింపుపై

వచ్చిన నివేదికలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై స్వతంత్ర సమీక్ష పూర్తయ్యే వరకు దానిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం తన నిర్ణయాలు, ఉత్తర్వులు, దస్త్ర వ్యాఖ్యలు, చట్టపరమైన ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని నాయకులు పేర్కొన్నారు. కేవలం ప్రకటనలతో సరిపెట్టకుండా అన్ని అంశాలపై ఆధారాలతో కూడిన వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని, ఎన్నికల సంఘం పనితీరుపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో కొలనుకొండ శివాజీ, వి గురునాధం, వేగి వెంకటేష్, నాగమధు యాదవ్, ఎన్ పవన్ తేజ నాయుడు, అమార్జా బేగ్ మహమ్మద్, బొర్రా కిరణ్, నరహరిశెట్టి నరసింహారావు, అంబటి రామకృష్ణ, చిలక విజయ్‌కుమార్, సనపల అన్నాజీరావు, ఏ వెంకటవర్మరాజు, శొంఠి నాగరాజు, శాంతకుమారి, మరిపి విద్యాసాగర్, కమలాకర్, డి రమేష్‌బాబు, కామన ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

