ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు రేపు భూమిపూజ
కేపీహెచ్బీ కాలనీలో నిర్మాణ పనులకు శ్రీకారం... 12 వేల ఫ్లాట్లతో పైలట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రణాళిక... తొలి దశలో 18 చోట్ల 7,340 ఫ్లాట్లు.. రూ.807.40 కోట్ల అంచనా...

హైదరాబాద్: హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మించనున్న టవర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. కేపీహెచ్బీ కాలనీలో టవర్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం. హైదరాబాద్ పరిధిలో మొత్తం లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ‘క్యూర్’లో 12 వేల ఫ్లాట్లతో పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. తొలి దశలో 18 ప్రాంతాల్లో 7,340 ఫ్లాట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.807.40 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. పట్టణ పేదలకు మెరుగైన గృహ వసతి కల్పించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

