ఏపీలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు.. కీలక శాఖల్లో విస్తృత మార్పులు
పర్యాటకం, విద్య, రవాణా, ఆరోగ్యం, గృహనిర్మాణం సహా పలు శాఖల్లో అధికారుల నియామకాలు... ఏపీటూరిజం, ఏపీఎస్ఆర్టీసీ, విశాఖ మెట్రోపాలిటన్ అథారిటీ, టీటీడీ తదితర కీలక సంస్థల్లో కొత్త బాధ్యతలు... తక్షణమే అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

ఎపి: ఆగస్టు 7 (ఆంధ్రప్రభ):ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు, అదనపు బాధ్యతలకు సంబంధించిన కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటకం, విద్య, రవాణా, ఆరోగ్యం, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి, దేవాదాయ శాఖలతో పాటు పలు కీలక విభాగాల్లో విస్తృత స్థాయిలో మార్పులు చేపట్టింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
ఉత్తర్వుల ప్రకారం శంషేర్ సింగ్ రావత్‌ను పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించగా, జె. శ్యామలరావును పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. కోన శశిధర్‌ను రవాణా, రోడ్లు–భవనాల శాఖ కార్యదర్శిగా నియమించారు. అమ్రపాలి కాటాను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించగా, పట్టన్‌శెట్టి రవి సుభాష్‌ను ఏపీటూరిజం అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు.
అదేవిధంగా గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక అధికారుల నియామకం, ఆరోగ్య, గృహనిర్మాణ, విపత్తు నిర్వహణ, విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, టీటీడీ, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ తదితర విభాగాల్లోనూ కొత్త నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

