బెజవాడలో ‘ఫుడ్ మాఫియా’..! ప్రజల ప్రాణాలతో చెలగాటం
▪️ అనుమతుల్లేకుండానే హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల నిర్వహణపై ఆరోపణలు... ▪️ అపరిశుభ్ర వాతావరణం, నిల్వ ఆహారం, నూనెల పునర్వినియోగంపై ఆందోళన... ▪️ ఫుడ్ సేఫ్టీ–కార్పొరేషన్ తనిఖీలు మరింత కఠినం చేయాలంటున్న నగరవాసులు...

విజయవాడ క్రైమ్: బెజవాడలో హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్‌సైడ్ టిఫిన్ సెంటర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని కేంద్రాలు అవసరమైన అనుమతులు, ఆహార భద్రతకు సంబంధించిన లైసెన్సులు లేకుండానే నిర్వహిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు వంటశాలల్లో పారిశుధ్యం, ముడిసరుకుల నిల్వ, వంటనూనెల వినియోగం వంటి అంశాల్లో ప్రమాణాలు పాటించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి.
ఇటీవలి తనిఖీల్లో కొన్ని ఆహార కేంద్రాల్లో నిల్వ ఉంచిన పదార్థాలు, అపరిశుభ్ర పరిస్థితులు తదితర లోపాలు బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. హోటళ్లలో ఆహారంలో బల్లి, జెర్రి వంటి జీవులు కనిపించాయంటూ సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడు వీడియోలు వైరల్ కావడం కూడా వినియోగదారుల్లో ఆందోళన పెంచుతోంది.
కలుషిత ఆహారం, నీటి కారణంగా వాంతులు, విరోచనాలు వంటి సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లే ఘటనలు నమోదవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా హాస్టళ్లు, విద్యార్థులు ఎక్కువగా భోజనం చేసే కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ అవసరమనే డిమాండ్ వినిపిస్తోంది.
ఫుడ్ సేఫ్టీ, కార్పొరేషన్ అధికారులు నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. అనుమతులు, పారిశుధ్యం, ఆహార నాణ్యతపై రాజీ లేకుండా తనిఖీలు నిర్వహించి ప్రజారోగ్యాన్ని కాపాడాలన్నదే ప్రధాన డిమాండ్.

