మత్తు ముఠాల జాడ చెప్పండి.. బహుమతి పొందండి
గంజాయి సేవించే వారి సమాచారం ఇస్తే రూ.1,500 నగదు బహుమతి.. విక్రయదారుల ఆచూకీ చెబితే రూ.5 వేల ప్రోత్సాహకం..

విజయవాడ క్రైమ్, ఆగస్టు 23 (V10TV): మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు ప్రజలు పోలీసులతో కలిసి ముందుకు రావాలని డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ పిలుపునిచ్చారు. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని స్కై హోటల్లో నిర్వహించిన ‘ఈగల్ ఛాలెంజ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గంజాయి, ఇతర నిషేధిత మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలను అరికట్టేందుకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.మాదకద్రవ్యాలపై పోలీసుల నిఘాతో పాటు ప్రజల నుంచి అందే విశ్వసనీయ సమాచారం కీలకమని డీసీపీ పేర్కొన్నారు. గంజాయి సేవించే వారి గురించి కచ్చితమైన సమాచారం అందించిన వారికి రూ.1,500, విక్రయించే వారి గురించి విశ్వసనీయ సమాచారం ఇచ్చిన వారికి రూ.5 వేల నగదు బహుమతి అందిస్తామని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఏసీపీ దామోదర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తును దెబ్బతీయడమే కాకుండా కుటుంబాలను కూడా తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుందన్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పులను తల్లిదండ్రులు గమనించాలని, యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఆధారాలు లేని ప్రచారాలు, వదంతులకు తావివ్వకుండా గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలపై కచ్చితమైన సమాచారాన్ని పోలీసులకు అందించాలని డీసీపీ, ఏసీపీ కోరారు. “వదంతులు కాదు.. వాస్తవాలు కావాలి.. ఊహలు కాదు.. ఆధారాలు కావాలి.. మీ సమాచారం ఈగల్ నిఘాకు బలం” అని పేర్కొన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1972కు తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాచవరం సీఐ చంద్రశేఖర్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

