మూడు వారాల్లో దావాజీగూడెం రోడ్డు పూర్తి చేయాలి
గన్నవరం–పుట్టగుంట ప్రధాన రహదారి పనులపై విప్ యార్లగడ్డ సమీక్ష... విద్యుత్ స్తంభాలు, లైన్లను తక్షణమే మార్చాలని అధికారులకు ఆదేశం... జాప్యానికి తావులేదు.. ప్రజలకు త్వరగా అందుబాటులోకి తేవాలని స్పష్టం...

గన్నవరం, ఆగస్టు 28: గన్నవరం–పుట్టగుంట ప్రధాన రహదారి నిర్మాణ పనులను మరో మూడు వారాల్లో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులను ఆదేశించారు.
దావాజీగూడెం రహదారి పనుల పురోగతిపై గన్నవరం కార్యాలయంలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పనుల్లో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా వేగం పెంచాలని స్పష్టం చేశారు. రహదారి నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, లైన్లను అత్యవసరంగా పక్కకు మార్చాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
తారు ధరలు భారీగా పెరగడంతో అంచనా వ్యయం పెరిగిందని, సవరించిన అంచనాలకు పరిపాలనా ఆమోదం పొందే ప్రక్రియ కారణంగా పనుల్లో ఆలస్యం జరిగినట్లు అధికారులు వివరించారు. ఇకపై ఎలాంటి కారణాలతోనూ పనులు ఆలస్యం కాకూడదని యార్లగడ్డ స్పష్టం చేశారు.
ఈ రహదారి పూర్తయితే ఉంగుటూరు మండలంలోని పలు గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. గన్నవరం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు.

