ట్రేడింగ్ నష్టాలు.. బ్యాంకు ఉద్యోగి బలవన్మరణం
నందమూరి నగర్‌లో విషాద ఘటన… రూ.1.50 కోట్ల పెట్టుబడితో నష్టపోయినట్లు సమాచారం… అప్పుల భారం పెరగడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం…

విజయవాడ, అక్టోబరు 1: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో నష్టాలు రావడంతో ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నందమూరి నగర్‌కు చెందిన కల్యాణ్‌కుమార్ (34) ఓ ప్రైవేటు బ్యాంకులో క్రెడిట్ అధికారిగా పనిచేస్తున్నాడు. స్టాక్ మార్కెట్‌లో సుమారు రూ.1.50 కోట్ల పెట్టుబడితో ట్రేడింగ్ చేసి నష్టపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. నష్టాల కారణంగా అప్పులు పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కల్యాణ్‌కుమార్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై అజిత్‌సింగ్‌నగర్ ఎస్‌ఐ రాధిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
