విజయవాడ సెంట్రల్లో వైసీపీ ఎన్నికల ప్రచార హోరు
ఎన్నికల ప్రచారంతో సందడిగా మారిన శివారు ప్రాంతాలు… ఐదు డివిజన్ల అభ్యర్థులకు మద్దతుగా మల్లాది విష్ణు ప్రచారం… మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మితో కలిసి ఓటర్లకు విజ్ఞప్తి…

పాయకాపురం, అక్టోబర్ 29 : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలోని శివారు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా 86వ డివిజన్ వైసీపీ అభ్యర్థి వై.తిరుపతమ్మ, 85వ డివిజన్ అభ్యర్థి అంగిరేకుల గొల్లభామ, 84వ డివిజన్ అభ్యర్థి వీర్ల వరలక్ష్మి, 83వ డివిజన్ అభ్యర్థి తేలుకుట్ల దేవి, 82వ డివిజన్ అభ్యర్థి అలంపూరు విజయలక్ష్మిలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆయా డివిజన్లలోని ఓటర్లను కలిసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పేదలు, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి తమ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని చెప్పారు. శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. కార్పొరేటర్ అభ్యర్థులతో పాటు మేయర్ అభ్యర్థిగా తనకు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మద్దతు ఇవ్వాలని కోరారు.

