ఓటర్లే టార్గెట్‌గా సైబర్ మోసాలు.. తస్మాత్ జాగ్రత్త!
ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల పేరుతో నకిలీ లింక్‌ల వల… వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైళ్లు ఇన్స్టాల్ చేస్తే వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే ప్రమాదం… అపరిచిత లింక్‌లను నమ్మొద్దని పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు హెచ్చరిక…

విజయవాడ, అక్టోబర్ 29: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు హెచ్చరించారు. ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవడం, పోలింగ్ కేంద్రాల వివరాలను పరిశీలించడం కోసం ప్రజలు చూపుతున్న ఆసక్తిని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందన్నారు. ఎన్నికల సమాచారం పేరుతో మొబైల్ ఫోన్లకు వచ్చే నకిలీ ఏపీకే ఫైళ్లు, వాట్సాప్ లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని గురువారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు. ఒక్క క్లిక్‌తో ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం! సైబర్ నేరగాళ్లు వాట్సాప్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా ద్వారా 'Voter_List.apk' పేరుతో నకిలీ ఫైళ్లను పంపించే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. ఓటరు జాబితాలో మీ పేరు చూసుకోండి, మీ పోలింగ్ బూత్ తెలుసుకోండి అంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దన్నారు. అనుమానాస్పద ఫైళ్లను మొబైల్లో ఇన్స్టాల్ చేస్తే వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొన్ని హానికరమైన యాప్‌ల ద్వారా ఫోన్లోని సమాచారాన్ని దొంగిలించి ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అధికారిక మార్గాల్లోనే ఓటరు వివరాలు తెలుసుకోవాలి ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాల కోసం అపరిచితులు పంపిన లింక్‌లను ఉపయోగించవద్దని సూచించారు. సమీపంలోని సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటరు జాబితాను పరిశీలించుకోవాలని తెలిపారు. అధికారిక ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా మాత్రమే వివరాలను తెలుసుకోవాలని కోరారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్స్టాల్ చేయవద్దని స్పష్టం చేశారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయండి ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేయాలని కమిషనర్ సూచించారు. అలాగే cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. అప్రమత్తతతోనే సైబర్ నేరాలను అరికట్టవచ్చని, వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కమిషనర్ రాజశేఖర బాబు విజ్ఞప్తి చేశారు.

