చోరీ కేసు విచారణ.. యువకుడి మృతితో కలకలం!
నాలుగు రోజులు చిత్రహింసలకు గురిచేశారంటున్న మృతుడి బంధువులు... 41 నోటీసు ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించామంటున్న పోలీసులు... లాకప్‌డెత్ ప్రచారం అవాస్తవం.. అనారోగ్యంతోనే మృతి: మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి...

విజయనగరం, ఆగస్టు 18 (V10TV AP): బంగారం దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. పోలీసుల దెబ్బల కారణంగానే అతడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. యువకుడు అనారోగ్యంతోనే మృతి చెందాడని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దీంతో బండారు మణికంఠ (24) మృతిపై ఆరోపణలు, పోలీసుల వివరణ పరస్పర విరుద్ధంగా మారాయి.
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొండకెంగువ గ్రామానికి చెందిన బండారు మణికంఠ వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గుమడాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బంగారం చోరీ కేసులో పట్టుబడిన వ్యక్తిని పోలీసులు విచారించగా మణికంఠ పేరు వెలుగులోకి రావడంతో అతడిని కూడా కేసులో నిందితుడిగా చేర్చి విచారించినట్లు సమాచారం.
మణికంఠను పోలీసులు తీసుకెళ్లి నాలుగు రోజులపాటు చిత్రహింసలకు గురిచేశారని అతని అన్న బండారు సతీష్ ఆరోపించారు. అప్పటికే మణికంఠ టైఫాయిడ్, మలేరియాతో బాధపడుతున్నాడని, పోలీసుల దెబ్బలతో ఆరోగ్యం మరింత క్షీణించిందని కుటుంబీకులు చెబుతున్నారు. అనంతరం విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మణికంఠ మృతి చెందినట్లు తెలిపారు.
మృతదేహాన్ని స్వగ్రామమైన కొండకెంగువకు తీసుకురాగా తల్లి బండారు అనూరాధ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన కుమారుడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మణికంఠ తల్లి డిమాండ్ చేశారు.
పోలీసుల వాదన మరోలా..
మణికంఠ మృతిపై వస్తున్న ఆరోపణలను పోలీసులు ఖండించారు. చోరీ కేసులో నిందితుడిగా మణికంఠను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే ముందు వైద్య పరీక్షలు నిర్వహించగా అతడు పూర్తి ఆరోగ్యంగా లేడని తేలడంతో నోటీసు ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.
మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్పందిస్తూ.. సాలూరు పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్ జరిగిందన్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. ఏప్రిల్ 12న నమోదైన చోరీ కేసులో మణికంఠను ఏ3గా అరెస్టు చేశామని, రిమాండ్‌కు తరలించే సమయంలో వైద్య పరీక్షల్లో జ్వరం ఉన్నట్లు గుర్తించడంతో అతని సోదరుడికి అప్పగించామని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు.
పోలీసుల చిత్రహింసల వల్లే మణికంఠ మృతి చెందాడన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, అనారోగ్య కారణాలతోనే మరణించాడని ఎస్పీ వెల్లడించారు. ఒకవైపు కుటుంబ సభ్యుల తీవ్ర ఆరోపణలు, మరోవైపు పోలీసుల ఖండన నేపథ్యంలో మణికంఠ మృతికి అసలు కారణమేంటన్నది చర్చనీయాంశంగా మారింది.

