రెండు గదుల్లోనే ఆరేళ్లుగా కళాశాల!
సొంత భవనం లేని ఆనందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల… రెండున్నర ఎకరాల స్థలం కేటాయించినా నిర్మాణం కోసం ఎదురుచూపులు… భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే గంటాకు ప్రిన్సిపాల్ కృష్ణవేణి వినతి…

విశాఖపట్నం, అక్టోబర్ 8: స్థలం కేటాయించినా సొంత భవనం లేక ఆనందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆరేళ్లుగా రెండు గదుల్లోనే నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ ఎన్.కృష్ణవేణి తెలిపారు. కళాశాలకు నూతన భవనం మంజూరు చేయాలని కోరుతూ గురువారం భీమునిపట్నం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేటాయించిన రెండు గదుల్లోనే తరగతులు నిర్వహించాల్సి వస్తోందని ఆమె వివరించారు. ప్రత్యేక భవనం లేకపోవడంతో విద్యార్థులు కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని, సమీప ప్రైవేటు కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. కళాశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం గతంలోనే రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కనే స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ నిర్మాణం చేపట్టలేదన్నారు. దీంతో ప్రభుత్వ విద్యావకాశాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనందపురంతోపాటు పరిసర గ్రామాల విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యను అందుబాటులో ఉంచేందుకు సొంత భవనం అత్యవసరమని కృష్ణవేణి పేర్కొన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, భవన నిర్మాణానికి అవసరమైన నిధులు, ఉత్తర్వులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.

