ఈ-కేవైసీకీ లంచమేనా?
ఈ-కేవైసీ కోసం రూ.7 వేల లంచం డిమాండ్... బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు... లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత...

విజయవాడ: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఈ-కేవైసీ చేసేందుకు రూ.7 వేల లంచం తీసుకుంటున్న సచివాలయ ఉద్యోగిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విజయవాడ పోలీస్ కాలనీలోని 75వ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా పనిచేస్తున్న వేముల సాంబశివరావు ఈ వ్యవహారంలో పట్టుబడ్డారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అవసరమైన ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు సాంబశివరావు రూ.7 వేలు లంచంగా డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా అధికారులు పథకం రూపొందించి నిఘా పెట్టారు.
బుధవారం బాధితుడి నుంచి రూ.7 వేల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి సాంబశివరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం సంబంధిత కార్యాలయంలో తనిఖీలు చేపట్టి, వ్యవహారానికి సంబంధించిన వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్లు సమాచారం.

