సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ వీఐపీ దర్శనాలు నిలిపివేత.. త్వరితగతిన సామాన్యులకు దర్శనం క్యూలైన్లలో తాగునీరు.. చంటి పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్ల పంపిణీ

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల క్షేత్రంలో ఆదివారం ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరావడంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత కల్పిస్తూ వీఐపీ భక్తుల దర్శనాలను నిలిపివేశారు. సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా అమ్మవారి దర్శనం జరిగేలా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఆలయ కార్యనిర్వహణ అధికారి శీన నాయక్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు అందించడంతో పాటు చంటి పిల్లల కోసం బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి లేకుండా క్యూలైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఘాట్ రోడ్డు, మహామండపం, అమ్మవారి ఆలయ ప్రాంగణంతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, పాలకమండలి, విజయవాడ నగర పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో సేవలు అందిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

