ఒక్క క్లిక్‌తో ఖాతాలు ఖాళీ.. విజయవాడలో సైబర్ మాయ!
నకిలీ ఆర్టీవో ఈ-చలానా లింక్‌తో యువకుడికి రూ.5.69 లక్షల నష్టం... రిఫండ్ పేరుతో మహిళను బురిడీ కొట్టించి రూ.71 వేలు స్వాహా... రెండు ఘటనల్లో రూ.6.40 లక్షలు మాయం.. అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక...

విజయవాడ, క్రైమ్: నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో ప్రజల బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, సామాజిక మాధ్యమాల ద్వారా పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఇటీవల విజయవాడలో వెలుగులోకి వచ్చిన రెండు ఘటనల్లో బాధితులు ఏకంగా రూ.6.40 లక్షలు పోగొట్టుకున్నారు.
నకిలీ చలానా.. రూ.5.69 లక్షలు మాయం
మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రీస్తురాజుపురానికి చెందిన ఓ యువకుడి మొబైల్‌కు జూన్ 6న వాహనానికి ఆర్టీవో జరిమానా పడిందంటూ సందేశం వచ్చింది. జరిమానా చెల్లించేందుకు కింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయాలని అందులో పేర్కొన్నారు. దానితో పాటు ఏపీకే ఫైల్ లింక్ ఉండటంతో అది నిజమైన చలానా సందేశమేనని భావించిన బాధితుడు దానిపై క్లిక్ చేసినట్లు సమాచారం.
ఆ తర్వాత అతడి బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డుల నుంచి విడతల వారీగా రూ.5.69 లక్షలు మాయమైనట్లు బాధితుడు గుర్తించాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రిఫండ్ ఆశ చూపి రూ.71 వేలు స్వాహా
మరో ఘటనలో వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన మహిళ మే 20న బ్లింకిట్ ద్వారా రెండు వస్తువులు ఆర్డర్ చేశారు. అందులో ఒక వస్తువు రాకపోవడంతో డెలివరీ బాయ్‌ను సంప్రదించారు. సమస్య పరిష్కారం కోసం అతడు ఇచ్చిన నంబర్‌కు కాల్ చేయగా, అవతలి వ్యక్తి రిఫండ్ చేస్తామంటూ నమ్మించినట్లు బాధితురాలు పేర్కొన్నారు.
ఈ క్రమంలో బ్యాంకు వివరాలు, ఓటీపీలు తెలుసుకుని ఆమె ఖాతా నుంచి రూ.71 వేలు మాయం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు జూన్ 1న పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయగా, దానిని కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
చిన్న నిర్లక్ష్యం.. సైబర్ దొంగలకు వరం
అనుమానాస్పద లింకులు, ఏపీకే ఫైళ్లు, నకిలీ చలానాలు, లాటరీలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, బిల్లు చెల్లింపుల పేరుతో వచ్చే సందేశాల విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కస్టమర్ కేర్ కోసం ఇంటర్నెట్లో కనిపించే గుర్తుతెలియని నంబర్లను నమ్మకుండా సంబంధిత సంస్థ అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్‌లోని సపోర్ట్ సేవలను మాత్రమే వినియోగించాలని చెబుతున్నారు.
ఓటీపీ, ఏటీఎం పిన్, సీవీవీ వంటి రహస్య వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు ఫోన్ చేయడం లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా సత్వర చర్యలకు అవకాశం ఉంటుందని పోలీసులు గుర్తుచేస్తున్నారు.
తస్మాత్ జాగ్రత్త.. ఒక్క క్లిక్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి!

