తీవ్రరూపం దాల్చనున్న ‘అర్నబ్’.. రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్!
28న బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం… గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు… అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు: హోంమంత్రి అనిత హెచ్చరిక…

అమరావతి, అక్టోబర్ 26: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను తీవ్రరూపం దాల్చే అవకాశమున్న నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత హైఅలర్ట్ చేశారు. సోమవారం అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా, మంగళవారానికి అతి తీవ్ర తుపానుగా బలపడి బుధవారం ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముందన్నారు. ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. వాతావరణం ప్రశాంతంగా ఉందని అలసత్వం వహించవద్దని, మంగళ, బుధవారాల్లో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు. తీరప్రాంత ప్రజలు, రైతులు రాబోయే మూడు నుంచి ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులను నమ్మకుండా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్ అధికారిక హెచ్చరికలనే పాటించాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.

