ఎన్నికల వేళ బెజవాడలో ఆంక్షల కంచె!
నవంబర్ 1 నుంచి 10 వరకు నిషేధాజ్ఞలు అమలు… ఐదుగురు అంతకుమించి గుమిగూడితే చర్యలు… శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీపీ రాజశేఖరబాబు…

విజయవాడ, అక్టోబర్ 30: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షల కంచె ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ ఉద్రిక్తతలు, ఘర్షణలు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నవంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు పది రోజులపాటు భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్)–2023లోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్న పది రోజులపాటు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే కర్రలు, రాళ్లు, ఇతర మారణాయుధాలతో బహిరంగ ప్రదేశాల్లో సంచరించడాన్ని నిషేధించారు. ఎన్నికల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజలు పోలీసు ఆంక్షలను గౌరవించి సహకరించాలని కోరారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు స్పష్టం చేశారు.

