తుపాను ఎఫెక్ట్.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు రోజులు పాఠశాలలకు సెలవులు!
తీవ్ర తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారుల నిర్ణయం… అక్టోబర్ 27, 28 తేదీల్లో అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవులు… భారీ వర్షాల ముప్పుతో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం…

విజయవాడ, అక్టోబర్ 26: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 27 (మంగళవారం), 28 (బుధవారం) తేదీల్లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు స్థానిక సెలవులు ప్రకటించినట్లు సమాచారం. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు ఈ మేరకు ప్రకటనలు జారీ చేసినట్లు వెల్లడైంది. తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.

