పెళ్లి సందడిలో విషాదం
డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్థి... ఆస్పత్రికి తరలించేలోపే 17 ఏళ్ల రవితేజ మృతి... డీజే మోత మధ్య ఘటన.. కుటుంబంలో తీరని శోకం...

కోస్గి, సెప్టెంబర్ 3: పెళ్లి ఇంట్లో అప్పటివరకు ఆనందంగా స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసిన ఓ ఇంటర్ విద్యార్థి క్షణాల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన నారాయణపేట జిల్లా కోస్గిలో విషాదాన్ని నింపింది.
కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లికి చెందిన దస్తయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు రవితేజ (17) ఇంటర్ చదువుతున్నాడు. స్నేహితుడి ఇంట్లో వివాహ వేడుక ఉండటంతో సోమవారం రాత్రి అక్కడికి వెళ్లాడు. పెళ్లి సందడిలో స్నేహితులతో కలిసి డీజే పాటలకు డ్యాన్స్ చేస్తుండగా రవితేజ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
దీంతో ఆందోళనకు గురైన స్నేహితులు, స్థానికులు వెంటనే అతడిని కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రవితేజ మృతి చెందినట్లు నిర్ధారించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.
అప్పటివరకు తమ కళ్లముందే ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన రవితేజ ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో స్నేహితులు షాక్కు గురయ్యారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్న వయసులోనే రవితేజ మృతి చెందడంతో పోతిరెడ్డిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
డీజే మోతపై మళ్లీ చర్చ
ఈ ఘటనతో వేడుకలు, ఊరేగింపుల్లో మితిమీరిన శబ్దంతో డీజేలు వినియోగించడంపై మరోసారి చర్చ మొదలైంది. అత్యధిక శబ్దానికి గురికావడం వల్ల గుండె వేగం, రక్తపోటు పెరగడంతో పాటు కొందరిలో గుండె లయలో మార్పులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె సంబంధిత సమస్యలున్న వారు అధిక శబ్దానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

