పీహెచ్‌డీ సాధించిన డా. నూనె ధనుంజయరావుకు అభినందనలు
స్టార్టప్ రంగంపై పరిశోధనతో డాక్టరేట్ పట్టా... విద్యార్థుల్లో ఆసక్తి పెంచే బోధనా విధానమే ఆయన ప్రత్యేకత... పూర్వ విద్యార్థి, జర్నలిస్ట్ గూడపాటి శ్రీకాంత్ హర్షం...

V10TV AP | ఆగస్టు 14, 2026 పీహెచ్‌డీ పట్టా సాధించిన డా. నూనె ధనుంజయరావుకు ఆయన పూర్వ విద్యార్థి, జర్నలిస్ట్ గూడపాటి శ్రీకాంత్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యార్థులకు క్లిష్టమైన పాఠ్యాంశాలను సైతం సులభంగా అర్థమయ్యేలా బోధిస్తూ వారిలో ఆసక్తిని పెంపొందించే ఉపాధ్యాయుడిగా ధనుంజయరావు ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. వీకేఆర్ అండ్ వీఎన్‌జీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న సమయంలో ధనుంజయరావు తనకు ఎంఈఎఫ్ఏ సబ్జెక్టును బోధించారని శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు. సాధారణంగా క్లిష్టంగా అనిపించే అంశాలను కూడా తన ప్రత్యేక బోధనా శైలితో ఆసక్తికరంగా మార్చి విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించేవారని తెలిపారు. విద్యాబోధనకే పరిమితం కాకుండా నిరంతరం కొత్త విషయాలను అధ్యయనం చేస్తూ, స్టార్టప్ రంగంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ సాధించడం అభినందనీయమన్నారు. ఈ విజయం వెనుక ధనుంజయరావు చేసిన కృషి, పట్టుదల ఎంతో ఉందని పేర్కొన్నారు. డా. నూనె ధనుంజయరావు జ్ఞానం, అనుభవం, పరిశోధనా దృక్పథం భవిష్యత్తులో మరెందరో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలని, విద్యారంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గూడపాటి శ్రీకాంత్ ఆకాంక్షించారు.

