కళ్లకు కనిపించి.. మనసును కదిలించిన ఛాయాచిత్రాలు
ఎన్టీఆర్ జిల్లా ఫొటోగ్రఫీ పోటీలకు విశేష స్పందన.. 221 ఎంట్రీల్లో 27 ఉత్తమ చిత్రాల ఎంపిక... సంస్కృతి–వారసత్వం, యువత–అభివృద్ధి, ఉత్తమ న్యూస్ పిక్చర్ విభాగాల్లో ప్రతిభ చాటిన ఫొటోగ్రాఫర్లు... ఆగస్టు 19న విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు.. కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందనలు...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
V10TV విజయవాడ, ఆగస్టు 14: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం నిర్వహించిన జిల్లాస్థాయి ఫొటోగ్రఫీ పోటీలకు విశేష స్పందన లభించింది. ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు పంపిన ఛాయాచిత్రాలు కళ్లకు కనిపించే దృశ్యాలకే పరిమితం కాకుండా మనసును కదిలిస్తూ, ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు.
పోటీల్లో విజేతల వివరాలను కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో ప్రకటించారు. ఫొటోగ్రాఫర్లలో నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు వారిని ప్రోత్సహించేందుకు ఏటా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, వారసత్వం, పర్యాటకం విభాగంలో వైవీవీ సత్యనారాయణ ప్రథమ, ఎన్.కిశోర్ ద్వితీయ, ఎం.ప్రశాంత్ తృతీయ బహుమతులకు ఎంపికయ్యారు. యు.దుర్గారావు, పి.ప్రసాద్, వైవీ ఆనంద్, ఆర్‌వీ అప్పారావు, కె.తిరుపతయ్య, కేబీ నవీన్ ప్రోత్సాహక బహుమతులు సాధించారు.
యువత, పీ4, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం విభాగంలో జీఎన్ రావు ప్రథమ, సీహెచ్ నారాయణరావు ద్వితీయ, ఎస్ఎస్ విజయబాబు తృతీయ బహుమతులకు ఎంపికయ్యారు. సీహెచ్ మస్తాన్, మణికంఠ, సీహెచ్ నారాయణరావు, బి.సతీష్ కుమార్, రాజేష్, బి.మరిడయ్య ప్రోత్సాహక బహుమతులు సాధించారు.

ఉత్తమ న్యూస్ పిక్చర్ విభాగంలో కేవీఎస్ గిరి ప్రథమ, ఎ.రాజేంద్రప్రసాద్ ద్వితీయ, దుర్గాప్రసాద్ తృతీయ బహుమతులకు ఎంపికయ్యారు. ఎ.రామచంద్రరావు, కె.చక్రపాణి, జి.మహేష్, బి.మరిడయ్య, ఎం.సంపత్ కుమార్, ఎస్.లక్ష్మీపవన్ ప్రోత్సాహక బహుమతులకు ఎంపికయ్యారు.
మొత్తం 221 ఛాయాచిత్రాలు పోటీలకు రాగా, వాటిలో 27 ఉత్తమ చిత్రాలను జ్యూరీ సభ్యులు ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. విజేతలకు ఆగస్టు 19న నిర్వహించే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ కార్యక్రమంలో నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించి సత్కరించనున్నట్లు వెల్లడించారు.
ఫొటోగ్రఫీ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలేనని పేర్కొన్న కలెక్టర్, రానున్న రోజుల్లో ఫొటో జర్నలిస్టులతో పాటు స్టూడియో, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు మరింత పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్‌డీవో వెన్నెల శ్రీను, జ్యూరీ సభ్యులు, సమాచార శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

