కార్యాలయంతో టీడీపీకి మరింత బలం
ఆటోనగర్లో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన... శాశ్వత కార్యాలయంతో కార్యకర్తల సమన్వయం, పార్టీ కార్యకలాపాలు మరింత పటిష్ఠం: తంగిరాల సౌమ్య... కార్యక్రమంలో కేశినేని చిన్ని, గద్దె అనురాధ, గద్దె రామ్మోహన్, శ్రీరామ్ తాతయ్య సహా ముఖ్య నేతలు...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
V10TV , విజయవాడ, ఆగస్టు 14: ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీకి శాశ్వత కార్యాలయం అందుబాటులోకి రావడం ద్వారా పార్టీ కార్యకలాపాలు మరింత పటిష్ఠం కానున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. విజయవాడ ఆటోనగర్లో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ జిల్లా స్థాయిలో శాశ్వత పార్టీ కార్యాలయం ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణతో పాటు నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయానికి ఈ కార్యాలయం కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసేందుకు కూడా కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు.
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని, వారి సమష్టి కృషితో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తామని సౌమ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

